హైదరాబాద్: నోవెల్ కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో కూడా కోర్టురూమ్‌ల్లోకి జనం రాకుండా చూస్తున్నారు. దీంతో అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నారు. ఇవాళ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించారు. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించగానే.. సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. దానికి తగినట్లే అత్యవసర కేసులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌కు కావాల్సిన గైడ్‌లైన్స్‌కు సంబంధించిన ఓ సుమోటో కేసును సీజే విచారించారు. ఆ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్, నాగేశ్వరరావులు ఉన్నారు. హైకోర్టుల్లోనూ వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలను తీసుకోవాలని సీజే ఆదేశించారు. కేవలం లాక్‌డౌన్ సమయంలోనే కాదు, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఈ-కోర్టులు ఏర్పాటు చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.